వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. జేపీసీ సూచించిన అంశాలను కలిపి మధ్యాహ్నం లోక్ సభలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టగా దానిపై సుదీర్ఘంగా 12 గంటల పాటు చర్చ జరిగింది. అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకున్న స్పీకర్ ఓం బిర్లా తొలుత మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించాలని ప్రయత్నించినా...ప్రతిపక్షాలు డివిజన్ కు పట్టుబట్టాయి. దీంతో అర్థరాత్రి 12.17 నిమిషాలకు స్పీకర్ ఓం బిర్లా వక్ఫ్ సవరణ బిల్లుపై ఓటింగ్ ను నిర్వహించారు. ఓటింగ్ లో మొత్తం 390 మంది ఎంపీలు పాల్గొనగా...వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించాలని 226 మంది అనుకూలంగా ఓటు వేయగా 163 మంది ఎంపీలు బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. ఫలితంగా లోక్ సభ వక్ఫ్ సవరణ బిల్లును 2025 ను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటన చేశారు. లోక్ సభలో తన పంతం నెగ్గించుకున్న NDA సర్కారు..గురువారం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. అక్కడ విజయవంతంగా బిల్లు పాసైతే తదుపరి రాష్ట్రపతి సంతకం కోసం పంపిస్తారు.